కలెక్టర్ నే వ‌ణికిస్తున్న టిఆర్ఎస్ నేత‌లు

ఆ జిల్లాలో వారు చెప్పినట్టు వినాల్సిందేనట. ఆ ఇద్దరు నేతలకు నచ్చకపోతే ఎంతటి వారినైన బదిలీచేయిస్తారట. ఆసిఫాబాద్‌ జిల్లా రాజకీయావర్గాల్లో ఇప్పుడు ఈ అశం పైనే హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆకస్మిక బదిలీ రాజకీయ అధికార వర్గాల్లో ఇటీవల చర్చకు దారితీసింది. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విధి నిర్వహణలో తనదైన మార్కు చూపించారు సందీప్‌. ఈ విషయంలో రాజకీయ వర్గాలకు తక్కువ ప్రయారిటీ ఇచ్చేవారని టాక్‌. దీంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలతో మొదటి నుంచి తగువేనట ఇంకేముంది వచ్చిన 9 నెలలకే కలెక్టర్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ చేతికి ఇప్పించారట…

ఒకానొక సమయంలో కలెక్టర్‌ తీరు నచ్చక కిందిస్థాయి ప్రభుత్వ సిబ్బంది సామూహిక సెలవులు పెట్టిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌కు నిత్యం పడేది కాదని చెబుతారు. దీంతో జిల్లాకు చెందిన ఆ ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ బదిలీకి హైదరాబాద్‌ స్థాయిలో పెద్ద యత్నాలే చేశారట. ఏకంగా సీఎస్‌ దగ్గర పంచాయితీ పెట్టారని సమాచారం. ఓ ఎమ్మెల్యే నిత్యాన్నదానం కార్యక్రమానికి సందీప్‌ కుమార్‌ అడ్డంకులు సృష్టించారని అధకార పార్టీ నేతలు ఆరోపించారట. పైగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని టీఆర్‌ఎస్‌ నాయకులు నిత్యం రుసరుసలాడటంతో అక్కడ నుంచి కలెక్టర్ కి కౌంట్ డౌన్ స్టార్టయిందట..

ఒకానొక సమయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకుని ఆ ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ మధ్య రాజీ కుదిర్చినా విభేదాలు సద్దుమణగలేదట. దీంతో కలెక్టర్‌గా విధులు చేపట్టిన 9 నెలలకే సందీప్‌కుమార్‌ బదిలీ కావడం రాజకీయవర్గాల్లో చర్చకు కారణమైంది. సందీప్‌కుమార్‌ ఝాకు ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. కానీ.. కొత్త కలెక్టర్‌ మాత్రం ఆర్డర్‌ కాపీ అందుకున్న గంటల వ్యవధిలోనే విధుల్లో చేరిపోయారు. దీంతో సందీప్‌కుమార్‌కు పోస్టింగ్‌ రాకపోవడానికి కారణం కూడా ఆ ప్రజాప్రతినిధులే అని చెవులు కొరుక్కుంటున్నారు.

మొత్తానికి ఆ ఇద్దరు నేతలకు నచ్చకపోతే జిల్లాలో కలెక్టరైనా ఇంకెవరైనా ఎక్కువ రోజులు విధులు నిర్వహించలేరనే ప్రచారం జోరందుకుంది. పైగా సందీప్‌ను బదిలీ చేయించడానికి ఆ ఇద్దరు చేసిన ప్రయత్నాలపై కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.