గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆ పేరుకున్న డిమాండే వేరు

-

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. అదే సెటిలర్స్.. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారికి మహానగరం ఆశ్రయమిచ్చింది. గంగా జమున తెహజీబ్‌ సంస్కృతికి ఆలవాలమైన హైదరాబాద్‌లో.. ఏ ఎన్నికలొచ్చినా సెటిలర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన సెటిలర్స్ ఈ సారి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. సీమాంధ్రుల ఓటు
ఎటు పడనుంది.

నగరం ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తరించుకుంటూ పెరిగిపోతుంది. ఒకప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలే. ఇప్పుడు సైబరాబాద్‌ కూడా వచ్చిచేరింది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జీహెచ్‌ఎంసీ విస్తరించి ఉంది. కొత్తగా విస్తరించిన, ఇంకా విస్తరిస్తున్న నగరంలో సెటిలర్సే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 74 లక్షల ఓటర్లుండగా, దాదాపుగా సగం మంది వరకు సెటిలర్స్ ఉంటారు. నగరంలో కొన్ని డివిజన్‌లు కొన్ని ప్రాంతాల వారికి పేరుగాంచి ఉన్నాయి. పాతబస్తీ, లష్కర్‌ వంటి చోట్ల లోకల్ పీపుల్ ఎక్కువగా ఉంటే.. కొన్ని ప్రాంతాలు మాత్రం… సెటిలర్స్ అడ్డగా ఉన్నాయి. ముఖ్యంగా కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, అమీర్పెట్, ఎల్భీనగర్, దిల్ సుఖ్ నగర్, జూభ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. సెటిరల్స్‌లో రెండు రకాలున్నారు. కొందరు ఇక్కడే సెటిలై పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారు.. మరికొందరు పొట్టకూటికోసం వచ్చిన వారు.

హైదరాబాద్‌లో లోకల్ వాళ్లే కాదు, నాన్ లోకల్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సెటిల్ అయి ఉన్నారు. అవునన్నా కాదన్నా .. కొన్ని డివిజన్లలో కచ్చితంగా సీమాంధ్రులు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఓట్లు పడకుండా గెలిచే పరిస్థితి ఉండదు.. అయితే రాష్ట్ర ఏర్పాటు జరిగాక రెండోసారి గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇపుడు లోకల్ నాన్ లోకల్, సెటిలర్స్ అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఉండనక్కరలేదు. కానీ ఈ అంశం ఇంకా సజీవంగానే ఉందంటున్నారు. పార్టీలు కూడా ఈ అంశాన్ని విస్మరించే స్థితిలో లేవు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపికలోనూ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ అంశం కూడా ప్రధానంగా నిలిచింది. ఆ సమయంలో సెటిలర్స్ చాలా మందిలో అనేక అనుమానాలు ఉండేవి. ముఖ్యంగా ఇంతకీ తమను హైదరాబాద్ లో ఉండనిస్తారా.. మా ఆస్తుల సంగతేంటీ, మా చుట్టాల పరిస్థితి ఏంటీ అంటూ ఎన్నో అంశాలపై ఆనాడు చర్చ సాగింది.. అయితే హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ప్రజలే అని టీఆర్‌ఎస్‌ నమ్మకం కల్పించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో సీమాంధ్రులు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ మద్దతు పలికారు. దాంతో టీఆర్ఎస్ 99 స్థానాలను కైవసం చేసుకోంది. గత ఎన్నికల్లో పదిమంది సెటిలర్సే విజయం సాధించారు. గ్రేటర్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆంధ్రా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెటిలై గెలిచిన వాళ్లే.

ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్లన్నీ ఏకపక్షంగా పడేలా కనిపించడంలేదు. గతంలో సెటిలర్స్ టీడీపీ గురించి ఎక్కువగా ఆలోచించేవారు. అయితే ఈసారి హైదరాబాద్‌లో టీడీపీ పెద్దగా పోటీలో లేదు. అలాగని టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా ఓట్లు పడేలా కనిపించడంలేదు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ తెరపైకి వచ్చింది. సెటిలర్ల ఓట్లు.. ప్రచారంశాలు, అభ్యర్థులు ఆధారంగా పార్టీల మధ్య చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి నగరంలోని కొన్ని డివిజన్లలో అభ్యర్థుల భవిష్యత్‌ను మాత్రం సెటిలర్లే డిసైడ్ చేయనున్నారు.

ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లోనూ సెటిలర్స్ అంశం ప్రభావం చూపనుంది. వీరి ఓట్లు చాలా డివిజన్లలో కీలకం కానున్నాయి. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. అక్కడ జరుగుతున్న అమరావతి ఉద్యమం.. వంటి అంశాలు ఇక్కడా ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news