అగ్రరాజ్య మాజీ అధ్యక్షుల పింఛను ఎంతో తెలుసా ?

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి పాలయ్యారు. కాగా అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. అయితే వీరి పదవీకాలం ముగిసిన తర్వాత వారు ఏం చేస్తారు? ఎలా జీవిస్తారనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయితే, దేశానికి సేవలందించినందుకు గానూ వీరికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ వస్తోంది.

trump obama
trump obama

మొదట్లో మాజీ అధ్యక్షులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి కావు. అయితే 1912లో ఆండ్రూ కార్నెగీ అనే పారిశ్రామిక వేత్త మాజీ అధ్యక్షులకు ఆర్థిక సాయం చెయ్యడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అది ఆనవాయితీగా మారింది. ఆ కాలంలోనే ఏటా 25వేల డాలర్లు పింఛను ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వం 1958లో ‘ఫార్మర్‌ ప్రెసిడెంట్‌ యాక్ట్‌’ను అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం పింఛను, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతోపాటు రహస్య భద్రత కల్పన వంటి వాటిని సమకూరుస్తోంది.

అమెరిగా మాజీ అధ్యక్షులకు సెక్రటరీ ఆఫ్‌ ట్రెజరీ పింఛను మంజూరు చేస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 2,19,200 డాలర్లు అంటే దాదాపు రూ.1.6కోట్లు పింఛను ఇస్తుంది. అయితే, ఏటా సమీక్ష ఆధారంగా పింఛను మొత్తంలో మార్పులు జరుగుతాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిన వెంటనే పింఛను ఇవ్వడానికి జరగాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20వేల డాలర్ల చొప్పున పింఛను ఇస్తారు.

అధ్యక్ష పదవి కాలం ముగిసిందంటే.. శ్వేతసౌధం విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అధ్యక్ష పీఠం దిగిన దగ్గర నుంచి ఏడు నెలల పాటు.. మాజీ అధ్యక్షుడు కొత్త ఆఫీసు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలు.. ఆఫీసు ఏర్పాటు చేసుకుంటే దాని అద్దె, టెలిఫోన్‌, ఇంటర్నెట్‌, ప్రింటింగ్‌, పోస్టల్‌ సేవలకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీంతోపాటుగా మాజీలకు వ్యక్తిగతంగా కొందరు ఉద్యోగులు ఉంటారు. వారికి ఇవ్వాల్సిన జీతాలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దేశాధ్యక్షుడికే కాదు.. మాజీ అధ్యక్షులకు కూడా మిలటరీ ఆస్పత్రుల్లోనే వైద్యం అందిస్తారు. ఇవే కాకుండా వారి కుటుంబానికి రహస్య భద్రతను కల్పిస్తారు.