పెద్దనోట్ల రద్దుకు నాలుగేళ్లు..మరి హమీల మాటేంటి…!

పెద్దనోట్ల రద్దు జరిగి నాలుగేళ్లు పూర్తయింది. చలామణిలో ఉన్న పాతనోట్లను రద్దు చేసి.. కొత్త నోట్లు చలామణిలోకి తెచ్చారు. ప్రజలు వందరోజులకు పైగా క్యూలో నిల్చుని, వ్యయప్రయాసల కోర్చి, నానా ఇబ్బందులు పడి నోట్లు మార్చుకున్నారు. మరి ఇంతా కష్టపడి కేంద్రం చేసిన సర్జికల్ స్ట్రైక్‌ ఎలాంటి ఫలితాలనిస్తోంది. నాడు రద్దు సందర్భంగా ప్రధాని మోడీ హామీలు నెరవేరాయా…

2016 నవంబర్ 8..దేశప్రజలందరూ ఎవరి పనుల్లో వారున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు.. పిడుగు లాంటి వార్త… దేశాన్ని ఊపేసింది. అదే నల్లనోట్ల రద్దు.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో మోడీ.. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న 86 శాతం కరెన్సీ చిత్తు కాగితాలుగా మారిపోయింది. ఇది అవినీతిపై మాస్టర్‌ స్ట్రోకన్నారు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు.

నోట్లు రద్దు చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. తనకు 50 రోజులు గడువు కావాలని కోరారు. డిసెంబర్ 30 వరకూ గడువు కావాలని.. డిసెంబర్ 30 తర్వాత, నోట్లరద్దులో తప్పు ఉందని తేలితే.. ఏ చౌరస్తాలో నిలబెట్టి శిక్ష విధించినా భరిస్తానన్నారు మోడీ. దేశప్రజలకు శరాఘాతంగా పరిణమించిన తన నిర్ణయాన్ని ఆయన నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై అది సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై వైపు ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు.

ఉన్నపళాన నోట్ల రద్దుతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకులో జమ చేసేందుకు జనం … భారీ క్యూలు కట్టారు. ఈ క్యూలు కిలోమీటర్ల పాటు సాగాయి. మరోవైపు…500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. క్రమంగా 500, 2000 రూపాయల నోట్లను తీసుకు వచ్చింది. బ్యాంకుల్లో రద్దీ పెరుగుతుండడం, నగదు మార్పిడి కష్టంగా మారడంతో… ఏటీఎంల నుంచి నోట్లు తీసుకోవచ్చని తెలిపింది. ఏటీఎంల నుంచి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు పడిన అవస్థలు అన్నీఇన్నీకాదు. దేశవ్యాప్తంగా నోట్ల మార్పిడి ఘటనల్లో వంద మందికిపైగా మృతిచెందారు.

నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 99 శాతం కరెన్సీ బ్యాంకులలో జమ అయ్యింది. కొందరు పాత కరెన్సీని ఆస్తుల రూపంలోకి మార్చుకున్నారని తెలియవచ్చింది. తరువాతి కాలంలో నోట్ల కొరత ఏర్పడి జనం పలు ఇబ్బందులు పడ్డారు. మొదట్లో రెండు వేల రూపాయల నోటు మాత్రమే మార్కెట్‌లో చలామణీలోకి వచ్చింది. ఇదే సమయంలో రెండు వేల రూపాయల దొంగనోట్లు కూడా మార్కెట్‌లోకి ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వం రెండు వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసింది.

డిజిటల్ ఎకానమీ, నగదురహిత లావాదేవీల దిశగా భారత్‌ను నడిపించేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. తన ప్రసంగంలో నల్లధనం రద్దు కంటే మూడు రెట్లు ఎక్కువగా నగదురహిత, డిజిటల్ అనే పదాలే ఎక్కువగా వాడారు. ఇక నవంబర్ 8న నోట్లు రద్దు చేస్తూ మాట్లాడిన సందర్భంలో.. ఒక్కసారి కూడా నగదు రహిత, డిజిటల్’ అనే పదాలే వాడలేదు. అంతే కాదు నల్లధనం వెలికి తీసి, దేశప్రజల ఖాతాల్లో వేస్తానన్న హామీ గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు.

అయితే విపక్షాలు మాత్రం… నల్లధనంపై కాదు… ఆర్థికవ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్ అని ఆరోపించాయి. కేవలం పదిహేనుమంది బడా కార్పొరేట్ వ్యాపారుల కోసం.. ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లనోట్ల రద్దును వ్యతిరేకించినందుకు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ రాజన్‌ను.. సాగనంపారన్నారు. అనుకూలంగా ఉండే వారిని పదవిలో కూర్చోబెట్టారని ఆరోపించారు. దీనివల్ల దేశం చాలా ఇబ్బందులు పడుతుందని… పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.