రీమేక్ కింగ్స్‌లా మారిపోతోన్న మెగాఫ్యామిలీ హీరోలు…!

మెగాఫ్యామిలీ హీరోలు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. సీనియర్‌ నుంచి యంగ్‌స్టర్‌ వరకు అంతా సేఫ్‌జోన్‌లో ఉండడానికే ప్రియారిటీ ఇస్తున్నారు. సక్సెస్‌ని రిపీట్‌ చెయ్యడానికి సక్సెస్‌ స్టోరీస్‌ని దింపేస్తున్నారు. పక్కవుడ్స్‌ నుంచి ప్రూవ్డ్‌ సబ్జెక్ట్స్‌ని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్‌ కళ్యాణ్ ఇద్దరూ కలిసి 5 రీమేకులని లైన్‌లో పెడితే, అల్లు అర్జున్‌ కూడా ఓ రీమేక్‌ని రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు రీమేక్స్‌ వైపు వెళ్లని బన్ని, ఇప్పుడు ఓ బాలీవుడ్‌ సినిమాని తెలుగులోకి తీసుకొస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి నుంచి అల్లు అర్జున్‌ వరకు మెగాఫ్యామిలీ స్టార్స్‌ అంతా రీమేకులకి సై అంటున్నారు. బాలీవుడ్‌ కామెడీ హిట్‌ ‘సోనూ కె టిటూ కీ స్వీటీ’ని రీమేక్‌ చెయ్యాలనుకుంటున్నాడట అల్లు అర్జున్. ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ తీసుకున్నాడని, వచ్చే ఏడాది ఈ మూవీ లాంచ్‌ అయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘పుష్ప’తో బిజీగా ఉన్న బన్ని, ఈ మూవీ తర్వాత కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఈ రీమేక్‌ ఉంటుందని తెలుస్తోంది.

చిరంజీవి ఇప్పటికే రెండు రీమేక్స్‌ని లైన్‌లో పెట్టాడు. మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో తమిళ ఫిల్మ్‌ ‘వేదళం’ని రీమేక్‌ చెయ్యబోతున్నాడు. అలాగే వి.వి.వినాయక్‌ డైరెక్షన్‌లో మళయాళీ హిట్‌ ‘లూసిఫర్’ రీమేక్ ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ రెండిటితో పాటు మళయాళీ మూవీ ‘డ్రైవింగ్‌ లైసెన్స్’ రైట్స్‌ కూడా తీసుకుంది కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ.

పవన్‌ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుసగా రీమేకులు చేస్తున్నాడు. ‘పింక్‌’ రీమేక్‌ ‘వకీల్‌సాబ్’తో రీ ఎంట్రీ ఇస్తోన్న పవన్‌, ఒక మళయాళీ స్టోరీకి కూడా సైన్‌ చేశాడు. పృథ్వీరాజ్, బిజూ మీనన్ లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌కి కమిట్ అయ్యాడు పవన్‌ కళ్యాణ్. రామ్‌ చరణ్‌ కూడా నెక్ట్స్‌ ఓ రీమేక్‌ చేస్తాడనే టాక్ వస్తోంది. తమిళ ఫిల్మ్‌ ‘తనిఒరువన్2’ని రీమేక్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు చరణ్ ‘తనిఒరువన్’ని ‘ధృవ’గా రీమేక్ చేశాడు. ఇప్పుడు ‘తనిఒరువన్‌2’ని ‘ధృవ2’గా రీమేక్‌ చేస్తాడనే టాక్ వస్తోంది. ‘ట్రిపుల్ ఆర్, ఆచార్య’ పూర్తయ్యాక ఈ రీమేక్‌ గురించి క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు.