వాటికీ బుర్రుందడోయ్…

కాకులంటే కావు.. కావుమని అరుస్తాయనే మనకు తెలుసు. కానీ.. వాటికీ బుర్రుందడోయ్. అవి కూడా బుర్ర పెట్టి ఆలోచిస్తున్నాయి అని అనిపిస్తుంది ఈ కాకులను చూస్తే. వీటికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని అనిపిస్తుంది. బహుశా.. ప్రపంచంలో ఇవే అత్యంత తెలివైన కాకులు కావచ్చు.. అని అనిపిస్తుంది. ఎహె.. ఇక ఆపు.. అసలు విషయం చెప్పు అంటారా? సరే.. సరే..


దక్షిణ పసిఫిక్ మహాసముద్రం తెలుసు కదా. ఆ సముద్రంలో ఓ చిన్న ద్వీపం ఉందట. ఆ ద్వీపంలో ఉన్న కాకులు ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకులట. అవి వాటి బుర్రకు పదును పెడతాయట. అచ్చం మనుషుల్లాగానే ఆలోచిస్తాయట. బుర్రతో పని చేస్తాయట. న్యూకాలెడోనియా అనే ద్వీపం అది. అవి ఎంత తెలివికల్లవో తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దామా…

వాటికి కావాల్సిన ఆహారం కోసం చాలా రకాలుగా వినూత్న పద్ధతులను ఫాలో అవుతాయట. అంటే.. చెట్ల లోపల ఉండే పురుగులను తినేందుకు వాటికవే రంద్రాలు చేసుకుంటాయట. గాలాలను తయారు చేసుకొని చెట్ల కర్రల లోపల ఉన్న పురుగులకు ఆ గాలాలను ఎరగా వేస్తాయట. ఎరను చూసి బయటికి వచ్చిన పురుగులను లటక్కున నోట్లో వేసుకుంటాయట. ఓహో.. వీటికి ఇంత తెలివి ఉంటుందా? వీటికి ఇంత తెలివి ఎలా వచ్చిందో తెలుసుకుందామని.. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్ వీటి కోసం ఓ ప్రత్యేకమైన మిషన్‌ను తయారు చేయించారట. ఎలా అంటే ఆ వెండింగ్ మిషన్ లోపల చిన్న చిన్న మాంసం ముక్కలు ఉంటాయన్నమాట. మిషన్‌లో చిన్న చిన్న కాగితం ముక్కలు వేస్తే మాంసం ముక్కలు బయటికి వస్తాయి. ఒక కాగితానికి ఒక మాంసం ముక్క అన్నమాట. అయితే.. వాటికి ఎలా తెలిసిందో ఏమో గాని.. అవి ఆ మిషన్‌ను తెగ వాడేస్తున్నాయట. లోపల కాగితం ముక్కను వేయడం లోపల నుంచి మాంసం ముక్క బయటికి రాగానే లటక్కున నోట్లే వేసుకోవడం. వీటి తెలివిని చూసి రీసెర్చర్స్ నోరెళ్లబెట్టారట.


అయితే.. ముందుగా ఆ వెండింగ్ మిషన్‌లో మాంసం ముక్క ఉందనే విషయాన్ని కాకులకు తెలిసేలా చేశారట పరిశోధకులు. అంటే.. ఆ బాక్స్ మీద చిన్న గులక రాళ్లు, పేపర్ ముక్కలను పెట్టారట. కాకులు వచ్చి గులక రాళ్లను పొడిచే సరికి.. అవి మిషన్ లోపల పడ్డాయట. దీంతో మాంసం ముక్కలు బయటికి వచ్చాయట. అలా.. అవి వెండింగ్ మిషన్‌లో ఉన్న మాంసం ముక్కల గురించి తెలుసుకొని తర్వాత తమ సొంత తెలివితోనే మాంసం ముక్కలను మిషన్‌లోనుంచి బయటికి తీసుకొచ్చుకున్నాయట. అంతా బాగానే ఉంది.. కానీ వీటికి ఇంత తెలివి ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని మాత్రం ఇంకా కనుక్కోలేక నెత్తిగోక్కుంటున్నారట ఆ పరిశోధకులు. మీకేమైనా తెలిసిందా.. వాటికి ఇంత తెలివి ఎక్కడినుంచి వచ్చిందో?